కోదాడ: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత వాలీబాల్ క్రీడాకారులను గుర్తించి ప్రోత్రహించేందుకు ఖేలో ఇండియా బాధ్యులు కృషి చేయాలని ఖేలో ఇండియా వాలీబాల్ రాష్ట్ర ఇన్‌చార్జి, అర్జున అవార్డు గ్రహీత రవికాంత్‌రెడ్డి కోరారు. బుధవారం కోదాడకు వచ్చిన ఆయన పలువురు క్రీడాకారులను కలిసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని, వారిని గుర్తించి తగిన శిక్షణ ఇస్తే పోటీల్లో రాణిస్తారన్నారు. దానికి కావాల్సిన సహాయ సహకారాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో చందా సుధాకర్‌రెడ్డి, సాజియా, ప్రమోద్‌రెడ్డి, శ్రీలత, శ్రీదేవి, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్కీ డ్రాల నిర్వహణ చట్టవిరుద్ధం : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా లక్కీ డ్రాలు, బహుమతుల పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలను నిర్వహించడం చట్టవిరుద్ధమని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తే విలువైన బహుమతులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు గెలుచుకోవచ్చంటూ ప్రజలను ఆకర్షిస్తూ లక్కీ డ్రాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి పథకాలు ప్రజల ఆర్థిక భద్రతకు తీవ్ర నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు, చట్టబద్ధమైన విధానాలు లేకుండా లక్కీ డ్రాలు, ప్రైజ్ చిట్స్, అదృష్ట పథకాలు నిర్వహించడం నేరమని, ఇలాంటి వ్యవహారాలపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యూలేషన్ స్కీమ్స్ యాక్ట్, చిట్ ఫండ్స్ చట్టాల ప్రకారం విచారణ జరిపి కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని.. ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారి కష్టార్జిత సొమ్మును దోచుకునే సామాజిక, ఆర్థిక నేరమని పేర్కొన్నారు.


