యూజీడీ.. అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

యూజీడీ.. అస్తవ్యస్తం

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

మార్చి 2027 నాటికి పూర్తిచేస్తాం

సూర్యాపేటటౌన్‌ : అమృత్‌ 2.0 పథకం కింద సూర్యాపేట మున్సిపాలిటీలో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా తవ్వకాలు, అధ్వానంగా మారిన రోడ్లతో వాహనదారులు, స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. 240 కిలోమీటర్ల మేర చేపట్టిన పనులను రూ.316 కోట్ల వ్యయంతో 2024 డిసెంబర్‌లో ప్రారంభించారు. దాదాపు రెండేళ్ల నుంచి ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.

రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పైపులైన్ల కోసం ప్రధాన రహదారులతోపాటు అంతర్గత వీధుల్లోనూ భారీగా తవ్వకాలు చేపట్టారు. పైపులైన్లు ఏర్పాటు చేసిన తర్వాత తవ్విన ప్రాంతాలను పూడ్చి రహదారులను పూర్వస్థితికి తీసుకురావాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. వర్షం కురిస్తే తవ్విన వీధులు బురదమయంగా మారుతున్నాయి. నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మ్యాన్‌హోళ్ల నిర్మాణంలోనూ నాణ్యత కరువు

డ్రెయినేజీ వ్యవస్థలో కీలకమైన మ్యాన్‌హోళ్ల నిర్మాణం కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు రహదారి స్థాయికి అనుగుణంగా లేకపోవడం, నిర్మాణ నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లపై ఎత్తుపల్లాలు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.

పనుల వివరాలు ఇలా..

ప్రాజెక్టు వ్యయం రూ.316కోట్లు

పనులు ప్రారంభం డిసెంబర్‌ 2024

నిర్మాణ నిడివి 240 కి.మీ.

పూర్తయిన పనులు 70 శాతం

గడువు మార్చి 2027

‘పేట’లో రెండేళ్లుగా అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు

ఎక్కడచూసినా తవ్వకాలతో

రోడ్లు గుంతలమయం

వర్షమొస్తే రాకపోకలకు ఆటంకం

ఇబ్బందుల్లో పట్టణ వాసులు

వ్యాపారులు, నివాసితులకూ ఇక్కట్లు

తవ్వకాల కారణంగా దుకాణాల వద్దకు వినియోగదారులు చేరుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. దుమ్ము, బురదతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రహదారులు సరిగా లేక వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, ఇతర వాహనాల రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పనులు పూర్తయిన ప్రాంతాల్లో వెంటనే నాణ్యమైన రోడ్లు వేయాలని, మ్యాన్‌హోళ్లను ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులను మార్చి 2027 నాటికి పూర్తిచేస్తాం. ఇప్పటివరకు సుమారు 70శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్న చోట కొత్తవి వేయిస్తున్నాం.

– అనిల్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement