భానుపురి (సూర్యాపేట) : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మురసు తుపాను ప్రభావం జిల్లాపై ఉండే అవకాశం ఉన్నందున హై అలర్ట్ ప్రకటించినట్టు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టర్ సోమవారం అత్యవసర వెబెక్స్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బలమైన గాలులకు అవకాశం
జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. తుపాను తీరం దాటే అవకాశం ఉన్నందున కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
సాయంత్రం 4 నుంచి ప్రయాణాలు వద్దు
తుపాను ప్రభావం నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయొద్దని కలెక్టర్ సూచించారు. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాల రాకపోకలను వీలైనంత వరకు నిలిపివేయాలన్నారు.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు గ్రామాలు, బలహీనమైన భవనాలను గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని సురక్షిత ఆశ్రయ కేంద్రంగా గుర్తించాలని సూచించారు. వాగులు, వంకలు, బ్రిడ్జిలు, కాజ్‌వేలపై వరద ప్రవాహం ఉంటే ప్రజలు, వాహనాల రాకపోకలను నిలిపివేయాలని చెప్పారు.
స్కూళ్లకు ముందస్తు ఆదేశాలు
విద్యార్థుల భద్రత దృష్ట్యా సోమవారం మధ్యాహ్న భోజనం తర్వాత స్కూళ్లకు సెలవు ప్రకటించి పిల్లలను ఇళ్లకు పంపించినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు టీచర్లు కూడా ఇంటికి వెళ్లాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలన్నారు.
24 గంటలు అందుబాటులో అధికారులు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులు, కట్టలు, కాల్వల నీటిమట్టాలను ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఇతర బృందాలు కూడా 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని చెప్పారు.
గంటకు 80 కిలోమీటర్ల వేగంతో
ఈదురుగాలులు వీచే అవకాశం
రేపు మధ్యాహ్నం వరకు
ప్రయాణాలు వద్దు
అధికారులతో అత్యవసర వెబెక్స్
సమావేశంలో కలెక్టర్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
నేడు మార్కెట్‌కు సెలవు
తుపాన్ నేపథ్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం సెలవు ప్రకటిస్తు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఫసీయుద్దీన్ ఒక ప్రకటన విడుదల చేశారు. కమీషన్‌దారులు సెలవు విషయాన్ని రైతులకు వివరించి ధాన్యం తేకుండా చూసుకోవాలని కోరారు.


