సూర్యాపేటటౌన్ : విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి బడులకు దూరమవుతున్న చిన్నారులను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నవంబర్ నెలను ‘ప్రత్యేక హాజరు నెల– వందశాతం హాజరు డ్రైవ్’గా ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయుల హాజరును కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ ఆర్‌ఎస్) ద్వారా ప్రతిరోజూ నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఒక్క పాఠశాలలోనూ హాజరు నమోదు కాకుండా ఉండకూడదని ఆదేశించారు. జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 50వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 4200 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
గైర్హాజరైతే ఇంటికే వెళ్లి..
పాఠశాలలకు వరుసగా ఐదు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు గైర్హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అలాంటి విద్యార్థులను గుర్తించి తొలుత తల్లిదండ్రులకు ఫోన్‌చేసి కారణాలు తెలుసుకోవాలి. అవసరమైతే ఉపాధ్యాయులు నేరుగా వారి ఇళ్లకు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలి. విద్యార్థులు బడికి రాకపోవడానికి గల కారణాలను తెలుసుకుని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. చదువు ప్రాధాన్యతను వివరించి తిరిగి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. పనిదినాల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యేలా, ప్రతి వారం హాజరు శాతాన్ని మెరుగుపరుచుకునేలా లక్ష్యాలను నిర్దేశించారు.
సాంకేతిక సమస్యలకు చెక్
హాజరు నమోదులో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని విద్యాశాఖ ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న ఓడీ ఎంట్రీలను 24 గంటల్లోగా క్లియర్ చేయాలి. ఎఫ్‌ఆర్‌ఎస్ పరికరాలు, నెట్‌వర్క్, హాజరు నమోదుకు సంబంధించిన సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలి. జిల్లా, మండల, క్లస్టర్ స్థాయిల్లో అధికారులు రోజువారీ హాజరును పర్యవేక్షించడంతో పాటు వారానికోసారి సమీక్షలు నిర్వహించాలి. ఎక్కడైనా హాజరు శాతం తగ్గితే అందుకు గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలి.
ప్రశంసాపత్రాలతో సత్కారం
విద్యార్థుల హాజరు పెంపులో తల్లిదండ్రులను భాగస్వాములను చేయనున్నారు. పేరెంట్స్, పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల క్రమబద్ధమైన హాజరుపై అవగాహన కల్పించాలి. గ్రామాల్లోనూ ప్రచారం చేపట్టి సమాజ భాగస్వామ్యంతో బడికి వచ్చే పిల్లల సంఖ్యను పెంచాలి. ఈ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వందశాతం హాజరు సాధించిన ప్రధానోపాధ్యాయులను ప్రశంసాపత్రాలతో సత్కరించనున్నారు.
నవంబర్‌ను ప్రత్యేక హాజరు నెలగా
ప్రకటించిన విద్యాశాఖ
స్కూల్‌కు వరుసగా ఐదు రోజులు
గైర్హాజరైతే ఇంటికెళ్లి ఆరా..
తల్లిదండ్రులతో మాట్లాడి బడికి
రప్పించేలా ప్రణాళిక
ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరుపై రోజూ
పర్యవేక్షణ..వారానికోసారి సమీక్ష
పనితీరుపై నెలాఖరులో సమీక్ష
నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి పనితీరును క్రోడీకరించి తుది సమీక్ష నిర్వహించనున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాల ఫలితాలను విశ్లేషించి, హాజరు శాతం పెంపులో సాధించిన పురోగతిని అంచనా వేస్తారు. నవంబర్ నెలతోనే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేయకుండా విద్యా సంవత్సరం మొత్తం ఇదే విధానాన్ని కొనసాగించేలా ప్రణాళిక రూపొందించనున్నారు.


