భానుపురి(సూర్యాపేట) : వర్షాభావంతో జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంది. అధికారికంగా అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా.. సహాయం, నష్టపరిహారం చెల్లింపుపై ప్రభుత్వ నుంచి స్పష్టత లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కేవలం కొన్ని మండలాలకే పరిహారం పరిమితమవుతుందా లేక అందరికీ న్యాయం జరుగుతుందా అనే దానిపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది.
పది మండలాల్లో తీవ్రంగానే..
సూర్యాపేట జిల్లాలో సాధారణ వర్షపాతం 571.8 మిల్లీమీటర్లు కాగా, ఈ సీజన్లో కేవలం 439.1 మిల్లీమీటర్ల వర్షపాతమే కురిసింది. అన్ని గ్రామాల్లోనూ జలాశయాలు అడుగంటాయి. మొత్తం 23 మండలాలకు గాను 14 మండలాల్లో లోటు వర్షపాతం నమోదుకాగా.. సగానికి పైగా మండలాల్లో భూగర్భ జలాలు అత్యంత లోతులోకి వెళ్లాయి. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కేవలం నాలుగు మండలాల్లోనే తీవ్రమైన కరువు ఉన్నట్లు ప్రకటించింది. మిగతా చోట్ల మధ్యస్థ కరువు ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ.. దాదాపు మరో 10 మండలాల్లోనూ తీవ్ర కరువు నెలకొని ఉన్నట్లు స్థానిక పరిస్థితుల ద్వారా తెలుస్తోంది.
నోటిఫికేషన్ ఆరునెలల పాటు అమలు..
జిల్లాలో కరువు పరిస్థితులపై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఆరు నెలల పాటు అమల్లో ఉండనుంది. ఈ సమయంలో ప్రజలకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ కరువు పరిస్థితులు ఉండగా, ప్రభుత్వం పరిహారం ఇస్తే కేవలం తీవ్రమైన కరువు ఉన్న మండలాలకే పంపిణీ చేస్తుందా.. మధ్యస్థ కరువు ప్రాంతాలకు పరిహారాన్ని వర్తింపజేస్తుందా అనేది రైతుల్లో నెలకొన్న ప్రధాన సందేహం. ఈ పరిహారం కేవలం పంటలు సాగు చేసి నష్టపోయిన వారికే ఇస్తారా.. లేదంటే వర్షాభావం కారణంగా కనీసం పంటలను సాగు చేయని రైతులను సైతం గుర్తించి పరిహారం వర్తింపజేస్తారా.. అనే చర్చ మొదలైంది. ప్రధానంగా తీవ్ర వర్షాభావం కారణంగా 4.90 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వరి.. కేవలం 3.70 లక్షల ఎకరాలకే పరిమితమైంది. తగ్గిన వరి విస్తీర్ణం స్థానంలో కొందరు ఆరుతడి పంటలు సాగుచేసినా అవి కేవలం పది నుంచి 20 వేల ఎకరాలలోపే ఉంటాయి. మిగిలిన విస్తీర్ణంలో నీరు అందుబాటులో లేక రైతులు పంటలను సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. మరి వీరికి పరిహారం అందుతుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నేరుగా లబ్ధి అంతంత మాత్రమే..!
తీవ్రమైన కరువు ఉన్న మండలాల్లోనే 33 శాతం పంట నష్టపోయిన రైతులకు నేరుగా పరిహారం ప్రభుత్వం అందజేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందిన నెల రోజుల్లో పరిహారం అందే అవకాశం ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని 23 మండలాలకు గాను కేవలం నాలుగు మండలాల్లోనే తీవ్ర కరువు ఉన్నందున ఇక్కడి రైతులకు మాత్రమే నేరుగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఇక ఉపాధి హామీ పనులు కల్పించడం, పశుగ్రాసం కొరత లేకుండా చూడడం, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకునే చర్యలతోనే ప్రభుత్వం సరిపెడుతుందా అనేది వేచి చూడాల్సిందే.
జిల్లాలోని అన్ని
మండలాల్లోనూ కరువు
రైతాంగానికి నష్టపరిహారంపై
లేని స్పష్టత
ప్రకటనతోనే సరిపెడతారా..
ఆందోళనలో జిల్లా రైతాంగం


