గరిడేపల్లి : రైతులు యాసంగిలో కూరగాయల సాగు చేపట్టడం ద్వారా తక్కువ నీటితో అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త సీహెచ్ నరేష్ అన్నారు. కేవీకే ఆధ్వర్యంలో గిరిజన రైతులకు బుధవారం యాసంగిలో కూరగాయల పెంపకం, మిరప సాగుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐసీఏఆర్, ఏటీఏఆర్ఐ, జోన్ 10 సహకారంతో గిరిజన ఉప ప్రణాళిక కింద ఆత్మకూరు ఎస్ మండలం బొట్యతండాకు చెందిన 20 మంది గిరిజన రైతులకు ఉచితంగా కూరగాయల, మిరప నారును పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులు బిందు సేద్యం, మల్చింగ్ పద్ధతులను అవలంభించాలని సూచించారు. గిరిజన రైతులకు శాసీ్త్రయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు కూరగాయలు, మిరప సాగుపై ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త ఈ ఆదర్శ్, గృహ విజ్ఞాన విభాగం సహాయకురాలు ఎన్ సుగంధి, కెవికె సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


