ఆత్మకూర్.ఎస్(సూర్యాపేట) : కాలం కలిసి రాకపోవడం, విద్యుత్ సక్రమంగా అందకపోవడంతో వరిం పంట ఎండిపోగా ఆ పంటను రైతు తగలబెట్టిన సంఘటన సోమవారం ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎస్) గ్రామానికి చెందిన యాతాకుల మల్లయ్య నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. వర్షాలు లేకపోవడం, కరెంటు కోతల కారణంగా పంట చేతికి వచ్చే దశలో మూడు ఎకరాల వరిపైరు ఎండిపోయింది. దీంతో పంటకు నిప్పు పెట్టి ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశాడు. కౌలు ఎట్లా కట్టాలి, పెట్టుబడి ఎట్లా ఎళ్లాలి, కుటుంబం ఎట్లా గడవాలి అని ఆవేదనను వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి తనలాంటి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.


