ప్రభుత్వ భూములు పరాధీనం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూములు పరాధీనం

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి..

కోదాడలో విలువైన ప్రభుత్వ భూములను ఇతరులకు అప్పగించడంలో స్థానిక రెవెన్యూ అధికారుల పాత్రపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలి. ఆస్పత్రి, ఎన్‌ఎస్‌పీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ స్థలాలను కోర్టు, సర్వేల పేరుతో పరులపాలు చేస్తున్నారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

– కుదరవెళ్లి బసవయ్య, కోదాడ

కోదాడ : కోదాడ కేంద్రంగా ప్రభుత్వ భూముల పరాధీన దందా కొనసాగుతుండగా.. ఓ విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొంత కాలం క్రితం వరకు కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో పని చేసిన ఆయన ఇటీవలే రిటైర్డ్‌ అయ్యారు. అయినా దందా మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ ఆస్తులను కావాడాల్సిన సదరు గవర్నమెంట్‌ కార్యాలయపు స్టీరింగ్‌ సదరు విశ్రాంత ఉద్యోగి చేతిలోనే ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణిలో కలెక్టర్‌కు వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపి వాస్తవాలు తేల్చాల్సిన అధికారులే.. అక్రమార్కులతో చేతులు కలిపి వారికి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇది నయా దందా

కోదాడ కేంద్రంగా నయాదందా నడుస్తున్నది. ఇందులో కొందరు రెవెన్యూ అధికారులే కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట 50 నుంచి 60 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సేకరించని భూమిలో తమకు ఇంకా కొంత భూమి ఉందని, దానిని తమకు అప్పగించాలని భూమిని అమ్మిన వారి వారసులు మొదట కోర్టులో కేసులు వేస్తారు. దీనిపై విచారణ సాకుగా చేసుకొని స్ధానిక రెవెన్యూ అధికారులు తప్పుడు సర్వేలతో మిగులు భూమిని చూపి దానిని ఫిర్యాదు దారుడికి అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మచ్చుకు కొన్ని..

కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి దాత ఇచ్చిన 2 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. కానీ కాంపౌండ్‌ లోపల రెండు ఎకరాలకంటే ఎక్కువ స్థలం ఉందని దాత వారసులు కోర్టులో కేసు వేయగా.. మిగులు భూమి ఉందంటూ తప్పుడు సర్వే సృష్టించి, ఆ మిగులు స్థలాన్ని దాత వారసులకు ధారాదత్తం చేసేలా సదరు విశ్రాంత ఉద్యోగి నివేదిక ఇప్పించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఇటీవల జిల్లా కలెక్టర్‌ రీ–సర్వే చేయించారు. అందులో రెండు ఎకరాలకు బదులు అర ఎకరం తక్కువగా ఉన్నట్లు తేలడం గమనార్హం.

కోదాడకు చెందిన ఓ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు నాలా సర్టిఫికెట్‌ పొందిందని కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేసిన ఆర్డీఓ కార్యాలయ అధికారులు.. ఆ కళాశాలకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అయితే, నివేదికలో కోదాడ కళాశాల పేరుకు బదులు వరంగల్‌లోని ‘కిట్స్‌ కళాశాల’ అని గుడ్డిగా టైప్‌ చేసి సంతకాలు పెట్టి మరీ కలెక్టర్‌కు పంపారు. పైగా ఈ విచారణ నివేదిక కాపీని ఏకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే పంపడం విడ్డూరం.

కోదాడ పట్టణంలోని అత్యంత విలువైన ఎన్‌ఎస్‌పీ స్థలం పరాధీనం అవుతున్న విషయంపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించగా.. వాస్తవాలను పక్కనబెట్టి ఆక్రమణదారులకే అనుకూలంగా నివేదిక ఇచ్చారు. తాజాగా కోట్ల విలువైన బీఎస్‌ఎన్‌ఎల్‌ స్థలాన్ని కూడా ఇదే విధంగా ఇతరులకు అప్పగించేందుకు రెడీ అయ్యారని సమాచారం.

తమ్మరబండపాలెంలోని సర్వే నంబర్‌ 39లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని కనగాల జనార్దన్‌రావు అనే వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు ప్రైవేట్‌ వ్యక్తులకు అనుకూలంగా రిపోర్ట్‌ ఇచ్చినట్లు తెలిసింది.

కొమరబండ వై–జంక్షన్‌ వద్ద ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి చుట్టూ రూ.70 వేలు వెచ్చించి అధికారులు ఫెన్సింగ్‌ వేశారు. కానీ, కొద్ది రోజులకే ఆక్రమణదారులు దాన్ని పీకేసినా అధికారులు కనీస చర్యలు తీసుకోకుండా.. ‘కోర్టులో కేసు ఉంది’ అంటూ దాటవేస్తున్నారు.

కాసులిచ్చే వారికి అనుకూలంగా నివేదిక

చక్రం తిప్పుతున్న ఆర్డీఓ కార్యాలయ రిటైర్డ్‌ ఉద్యోగి

తప్పుడు సర్వేలతో ప్రైవేట్‌ వ్యక్తులకు కోట్ల విలువైన భూములు

రిటైర్‌ అయినా పెత్తనం..

ఇటీవలే పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి ఇంకా అదే కార్యాలయంలో పెత్తనం చెలాయిస్తున్నాడని, ఇక్కడ జరిగే కీలక విచారణ నివేదికలన్నీ ఆయనే తయారు చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సదరు ఉద్యోగిని ప్రసన్నం చేసుకుంటే చాలు వాస్తవాలను పక్కదోవ పట్టిస్తూ క్షణాల్లో వారికి అనుకూలంగా రిపోర్ట్‌ సిద్ధమవుతోందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement