ధాన్యం ధర తగ్గించి దగా | - | Sakshi
Sakshi News home page

ధాన్యం ధర తగ్గించి దగా

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

అష్టకష్టాలకు ఓర్చి..

ఫ దసరా నుంచి వ్యాపారుల సిండికేట్‌

ఫ అన్నిరకాల వడ్లపై క్వింటాకు రూ.400 వరకు తగ్గించి కొనుగోలు

ఫ ధాన్యం దండిగా రావడమే కారణం

ఫ గిట్టుబాటు కావట్లేదని

రైతుల ఆవేదన

భానుపురి (సూర్యాపేట) : ధాన్యం వ్యాపారుల దగా మొదలైంది. ఇంతకాలం అక్కడక్కడా వరికోతలు ప్రారంభం కావడంతో అధిక ధరలు వెచ్చించి ధాన్యాన్ని కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వరికోతలు ముమ్మరంగా కావడంతో మార్కెట్లు, మిల్లులకు ధాన్యం దిగుబడి వెల్లువలా తరలి వస్తోంది. దీంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. తీవ్ర వర్షాభావంతో కొంతమేర పంటను నష్టపోయి చేతికొచ్చిన దిగుబడికై నా ధర పడుతుందని ఆశపడిన రైతులకు ఎంతకాలం సంతోషం నిలువకుండా పోయింది.

ముమ్మరంగా వరికోతలు

జిల్లాలో 3.70 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 90 శాతం మేర రైతులు సన్నరకం వడ్ల సాగు చేశారు. రోహిణి కార్తెలో నార్లు పోస్తున్న రైతుల పొలాలు ఇప్పటికే నూర్పిడి అయ్యాయి. 20 రోజులుగా ఈ వరికోతలు సాగగా.. దసరా పండుగ వరకు కూడా పెద్దగా వరికోతలు జరగలేదు. అక్కడక్కడా కోసిన వడ్లను తిరుమలగిరి, సూర్యాపేట మార్కెట్లతోపాటు చుట్టుపక్కల మిల్లులకు రైతులు తరలించారు. ఈ సమయంలో ఒక్కో మిల్లుకు రెండు నుంచి మూడు ట్రాక్టర్లు మాత్రమే వడ్ల లోడుతో వెళ్లాయి. తుపాను భయంతోపాటు పొలాలు సైతం చేతికి రావడంతో ముమ్మరంగా వరికోతలు సాగుతున్నాయి.

దసరా నుంచి తగ్గిస్తూ..

దసరా పండుగకు ముందు వరకు కూడా సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్‌లే కాకుండా ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు సైతం దొడ్డు రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,400 వరకు చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్న రకంలో సాంబ మసూరి క్వింటాకు రూ.3,500 వరకు, చింట్ల రకానికి క్వింటాకు రూ.4,400 నుంచి రూ.5,000 వరకు కూడా ధర పెట్టారు. కొందరు వ్యాపారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి అక్కడే ఈ మేరకు ధరలను చెల్లించి కొనుగోలు చేశారు. ఇక వరికోతలు ముమ్మరమై మార్కెట్‌కు ధాన్యం పెద్ద ఎత్తున వస్తుండడంతో వ్యాపారులు తమ సిండికేట్‌ అవతారాన్ని బయటకు తీశారు. అన్ని రకాల వడ్లకు క్వింటాకు రూ.100 నుంచి రూ.400 వరకు తగ్గించి కొంటున్నారు.

వర్షాభావానికి తోడు కరెంటు కోతల కారణంగా వరిపంటను పండించేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. రాత్రి పగలు అంటూ తేడా లేకుండా బోరుబావుల వద్దకు పరుగులు తీసి వచ్చిరాని కరెంటుకు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్న పెట్టుబడులు పెట్టి పంటలు దక్కించుకున్నారు. కొందరు వేలాది రూపాయలు వెచ్చించి జనరేటర్లు సైతం నడిపించి నీరందించడం ద్వారా పంటను కాపాడుకున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా వడ్లకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ధర వస్తుండగా.. దీన్ని తగ్గిస్తే తాము నష్టపోతామని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు తమ కష్టనష్టాలను చూసి ధరను తగ్గించకుండా మార్కెట్‌ డిమాండ్‌ దృష్ట్యా మంచి ధర పెట్టాలని రైతులు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement