సూర్యాపేట(భానుపురి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఓట్ చోరీ విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో చేపడుతున్న శ్రీఓట్ బచావో– దేశ్ బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు రాంభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యతో కలిసి మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. ఎల్లకాలం అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఓట్లను తొలగించే కుట్రకు తెరలేపారన్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్‌ను తన చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ, ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానాలను చాలాకాలంగా రాహుల్ గాంధీ ఎండగడుతూ ఆధారాలను ప్రజల ముందు ఉంచుతున్నారన్నారు. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన పలు తీర్మానాలు బహిర్గతం కావడంతో రాహుల్ గాంధీ ఆరోపణలు నిజమనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్నదన్నారు. రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి సైతం లేని విధంగా పదవిలో ఉండగా, పదవి నుంచి దిగిపోయాక కూడా ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా ఎన్నికల కమిషనర్‌కు రక్షణ కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అందుకే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పోతు భాస్కర్, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, పార్టీ మండల అధ్యక్షుడు కోతి గోపాల్‌రెడ్డి, నాయకులు ధరావత్ వీరన్న నాయక్, ముస్కు రాంచంద్రరెడ్డి, వేములపల్లి వాసుదేవరావు, అబ్దుల్ రహీం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ పాల్గొన్నారు.
ఏఐసీసీ పరిశీలకుడు రాంభూపాల్‌రెడ్డి


