సూర్యాపేటటౌన్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు–2026 సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాల్లో సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్రెడ్డికి పోలీస్ ఉత్తమ సేవా పతకం లభించింది. శనివారం హైదరాబాద్లో డీజీపీ సీవీ ఆనంద్ తన కార్యాలయంలో రవీందర్రెడ్డికి పతకం అందించి అభినందించారు.
సుదీర్ఘ సేవలకు గుర్తింపు..
అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి 1992లో సబ్ ఇన్స్పెక్టర్గా పోలీస్ శాఖలో నియామకమై, పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేష్న్లో తొలి పోస్టింగ్ తీసుకున్నారు. అనంతరం 2007లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ఎస్ఐ, సీఐ హోదాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేవలందించారు. 2017లో డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం సీఐడీ విభాగంలో విధులు నిర్వహించారు. 2021లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది వికారాబాద్ జిల్లాలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ డీసీపీగా, నిజామాబాద్లో, సికింద్రాబాద్ రైల్వే విభాగంలోనూ వివిధ హోదాల్లో సేవలందించారు. పోలీస్ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆయనకు పోలీస్ ఉత్తమ సేవా పతకం లభించడం పట్ల ఎస్పీ నరసింహతోపాటు జిల్లా పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.


