సూర్యాపేట (సూర్యాపేటటౌన్) : సైబర్ మోసాలు అరికట్టేందుకు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, పోలీసు సేవలు అందించడంలో ఆలస్యం చేయొద్దని ఎస్పీ నరసింహ పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో కోదాడ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, నేరస్తులకు శిక్షలు పడేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించాలని, పోలీస్ సేవలు అందించడంలో ఎలాంటి ఆలస్యం చేయొద్దని సూచించారు. సామాజిక అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలన్నారు. కేసుల దర్యాప్తులను ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులో పూర్తి చేసి, నిర్దేశించిన సమయంలోనే కోర్టులకు పంపించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ మగ్దుం అలీ, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, క్లూస్ టీం ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


