సూర్యాపేట : గాంధేయ మార్గంలో పోరాడి జిల్లాకు బుల్లెట్ రైలును సాధించి తీరుతామని బుల్లెట్ రైలు సాధన అఖిలపక్ష పోరాట కమిటీ నాయకులు అన్నారు. బుల్లెట్ రైలు సాధన ఉద్యమంలో భాగంగా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలోని గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ దీక్షలో బుల్లెట్ రైలు సాధన సమితి నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ దీక్షకు ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్, టీయూడబ్ల్యూజే ఐజేయూ నాయకులు, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి
జిల్లా మీదుగా బుల్లెట్ రైలు కారిడార్ ఏర్పాటు డిమాండ్ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని బుల్లెట్ రైలు సాధన సమితి నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం సూర్యాపేటలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీలతారెడ్డి మాట్లాడుతూ త్వరలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి విషయాన్ని విన్నవిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, సీపీఎం, టీజేఎస్, సీపీఐ, న్యూడెమాక్రసీ, మాస్‌లైన్, బీజేపీ నాయకులు మల్లు నాగార్జునరెడ్డి, కుంట్ల ధర్మార్జున్, బెజవాడ వెంకటేశ్వర్లు, మండారి డేవిడ్ కుమార్, కొత్తపల్లి శివకుమార్, మట్టిపల్లి సైదులు, తుకాని మన్మధరెడ్డి, టీకుల్ల సాయిరెడ్డి, పాండురంగాచారి పాల్గొన్నారు.


