గరిడేపల్లి : సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ పెండెం వెంకటరమణ సూచించారు. గరిడేపల్లి మండలం కల్మల్‌చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పలు వివరాలు తెలుసుకున్నా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మలేరియా, డెంగీ వంటి వ్యాధుల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అఖిల్ కిషోర్, హెచ్‌ఈఓ సురేంద్ర, పీహెచ్‌ఎస్ జయమ్మ, నర్సింగ్ ఆఫీసర్లు జానకి, కళ్యాణి, ఏఎన్‌ఎంలు సుజాత, రాంబాయి, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత
స్థాయికి ఎదగాలి
తుంగతుర్తి : విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా నాణ్యమైన విద్యనందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఉషారాణి అన్నారు. గురువారం తుంగతుర్తిలోని తెలంగాణ గురుకులాన్ని తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి సమాజంలో ఎలా ఉండాలో లక్ష సాధనకు ఎలా ముందుకు వెళ్లాలో వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గురుకులంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆమె వెంట డిప్యూటీ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సతీష్ ఉన్నారు.
సీపీఎస్ విధానం రద్దుచేయాలి
నేరేడుచర్ల : సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించి టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు. గురువారం నేరేడుచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో భాగంగా ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయడంతోపాటు 2వ పీఆర్‌సీని అమలు చేయాలన్నారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో చేపట్టే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, పాఠశాల హెచ్‌ఎం బట్టు మధు, ఉపాధ్యాయులు శ్రీనయ్య, నరసింహారావు, వెంకటేశ్వర్‌రావు, వెంకటేశ్వర్లు, సైదులు, వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకన్న, అక్కయ్య బాబు పాల్గొన్నారు.


