సీఆర్‌టీలతో సమానంగా వేతనాలు ఇవ్వాలి
పెద్దవూర : తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్(ఏఐ) ఉపాధ్యాయులు సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఒకే పాఠశాలలో రెగ్యులర్, సీఆర్‌టీ (కాంట్రాక్ట్ రెసిడెన్స్ ఉపాధ్యాయులు)లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న తమకు వేతనాల్లో తీవ్ర వ్యత్యాసం చూపడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్‌టీలతో సమానంగా వేతనాలు ఇచ్చేదాకా తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 110 మంది..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా.. అందులో నల్లగొండ జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక పాఠశాల ఉన్నాయి. నల్ల గొండ జిల్లాలో 76 మంది, సూర్యాపేటలో 27 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 గురు చొప్పున మొత్తం 110 మంది అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు పనిచేస్తున్నారు.
జీతం తక్కువ.. పని ఎక్కువ..
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఆరు గిరిజన వసతి గృహాలను 2015 నవంబర్‌లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలుగా మార్చారు. ఇక్కడ ఎలాంటి శాంక్షన్డ్ పోస్టులను మంజూరు చేయకుండా, 2015లో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా రూ.5,000 వేతనంతో నోటిఫికేషన్ విడుదల చేశారు. భవిష్యత్తులో వేతనాలు పెరుగుతాయనే ఆశతో ఉన్నత విద్యనభ్యసించిన నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వేతనాలు పెంచాలని వీరు ఆందోళనలు చేపడటంతో, 2020లో వేతనాన్ని రూ.12,000కు పెంచి ‘పార్ట్ టైం’ అని తొలగించి ‘విద్యా వాలంటీర్లు’గా మార్చారు. అనంతరం సీఆర్‌టీలతో సమానంగా వేతనం ఇవ్వాలని విన్నవించగా, 2023లో ఈ పోస్టును ఔట్‌సోర్సింగ్‌కు మార్చి ‘అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్’ ఉపాధ్యాయులుగా పేరు మార్చారు. వేతనాన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించడంతో ప్రస్తుతం చేతికి రూ.10,440 మాత్రమే వస్తున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రస్తుతం సీఆర్‌టీ స్కూల్ అసిస్టెంట్లకు రూ.28,977, ఎస్‌జీటీలకు రూ.21,255 చెల్లిస్తున్నారు. తమకు కూడా ఇదే వేతనాన్ని వర్తింపజేయాలని అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. వీరికి సంబంధించిన వేతన పెంపు ఫైల్ ఆర్థికశాఖ మంత్రి పేషీలో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉందని, తక్షణమే దానికి ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలల
అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నిరవధిక సమ్మె
నేడు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా
సీఆర్‌టీలతో సమానంగా వేతనం
చెల్లించాలని డిమాండ్
అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు సీఆర్‌టీలతో సమానమైన వేతనం ఇవ్వాలి. పీజీలు, బీఈడీలతో పాటు టెట్ క్వాలిఫై అయినా ఈ వ్యత్యాసం ఏంటో అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్లుగా మా సమస్య పరిష్కారం కాలేదు. అందుకే చేసేది లేక సమ్మెకు దిగాం. వేతనాలు పెంచేదాకా సమ్మె కొనసాగిస్తాం.
– బి. సురేందర్, అకాడమిక్
ఇన్‌స్ట్రక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


