అర్వపల్లి : గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలంతా ఒకచోట చేరి మాట్లాడుకునేందుకు రచ్చబండలు ఉండేవి. ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రజలు సెల్‌ఫోన్‌లకు ఆకర్షితులై ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం పూర్తిగా తగ్గి పోయింది. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం ఎస్సీ కాలనీ వాసులు తామంతా ఒకచోట చేరి మాట్లాడుకునేందుకు వీలుగా రూ.2 లక్షల సొంత ఖర్చుతో రచ్చబండను నిర్మించుకున్నారు. రచ్చబండ వద్ద అన్ని దినపత్రికలను కూడా వేయిస్తున్నారు. కాలనీవాసులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో రచ్చబండ వద్దకు చేరి పత్రికా పఠనంతో పాటు తమ సమస్యలను చర్చించుకుంటారు. కాలనీకి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా రచ్చబండ వద్దే సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడుతున్నారు.


