సూర్యాపేట : సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, నాణ్యమైన విద్య అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వంటశాల, భోజనశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు హిందీ పాఠం బోధించారు. కంప్యూటర్ ల్యాబ్, ప్లేగ్రౌండ్‌ను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్లేగ్రౌండ్‌ను విస్తరించాలని విద్యార్థులు కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత సంతృప్తికరంగా ఉందని తెలిపారు. టాయిలెట్స్, ఫ్యాన్లు, లైట్లు, డోర్లు మైనర్ రిపేర్లు ఉంటే 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ సీహెచ్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు భవాని తదితరులున్నారు.
నిర్దేశిత గడువులోగా పనులు పూర్తిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : జాతీయ రహదారి విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జాతీయ రహదారి – 65 కు సంబంధించి రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఎస్పీ నరసింహతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిశితంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విస్తరణ, ఫ్లైఓవర్ పనులు జరిగే మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల సైన్ బోర్డులు, రక్షణ కంచెలను ఏర్పాటు చేయాలని సూచించారు. వారి వెంట జాతీయ రహదారుల అథారిటీ అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


