ప్లాస్టిక్‌తో చాలా అనర్థాలు
ఫ వృత్యంతర శిక్షణకు
స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో హాజరు
ఫ భోజనానికి, నీళ్లు తాగడానికి వీటినే వినియోగిస్తున్న ఉపాధ్యాయులు
ఫ ప్లాస్టిక్ వాడకాన్ని
నిషేధించాలని సందేశం
సూర్యాపేటటౌన్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బయోసైన్స్ ఉపాధ్యాయులు ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి నడుంబిగించారు. జిల్లా కేంద్రం సమీపంలోని కుడకుడ జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లాలోని బయో సైన్స్ టీచర్లకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శిక్షణలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులను పూర్తిగా పక్కనబెట్టి ఇంటి నుంచే స్టీల్ ప్లేట్లు, గ్లాసులు తెచ్చుకుని భోజనం చేస్తున్నారు. ఈ శిక్షణలో మధ్యాహ్నం సమయంలో భోజనం, సాయంత్రం టీ తాగేందుకు ఇంటి నుంచే తెచ్చుకున్న స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వినియోగిస్తూ ప్లాస్టిక్ వినియోగానికి చెక్ పెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పర్యావరణం మేలు కోసం..
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉపాధ్యాయులే ముందుగా ఆచరణలో చూపాలని భావించి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బయోసైన్స్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాల ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయుల కార్యాచరణ ఇతర శాఖల ఉద్యోగులు, విద్యార్థుల్లోనూ స్ఫూర్తి నింపుతుందని అభిప్రాయపడుతున్నారు.
మంచి సందేశం ఇవ్వాలని..
జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహితమైన విధానాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలని శిక్షణ కార్యక్రమంలో స్టీట్ ప్లేట్లు, గ్లాసులు వాడుతున్నారు. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. మనకు తెలియకుండానే ఆరోగ్యం చాలా తీవ్ర స్థాయిలో దెబ్బతింటోంది. ప్లాస్టిక్ చెత్త ఎక్కడపడితే అక్కడ గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రతిఒక్కరూ దీనిని బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉంది. అయితే సరిగ్గా ఇలాగే ఆలోచించారు జిల్లాలోని బయో సైన్స్ టీచర్లు. ప్రకృతి గురించి, జీవరాసుల ప్రాధాన్యత గురించి పిల్లలకు పాఠాలు చెప్పే వీళ్లు ముందుగా తాము పర్యావరణ హితం కోరి పని చేయాలనుకున్నారు. అందుకే జిల్లాలోని 80 మంది బయోసైన్స్ టీచర్లు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, స్టీల్ టీ గ్లాసులు సైతం వెంట తెచ్చుకుంటూ వినియోగిస్తుండడం నిజంగా సమాజానికి మేలుకొలుపే అని చెప్పాలి.
ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. వాటిని ప్రజలకు వివరించేలా తమ వంతు ప్రయత్నంగా ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాల సందర్భంగా స్టీల్ ప్లేటు, గ్లాసులు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నాం. రానున్న రోజుల్లో ఎక్కడికెళ్లినా బ్యాగుల్లోనే స్టీల్ బాటిల్, ప్లేటు, గ్లాసు పెట్టుకుని వెళ్తాం.
– దేవరాజు, జిల్లా సైన్స్ అధికారి


