పైకిరాని గంగమ్మ
భానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీనికి తోడు రానున్న రోజుల్లోనూ వర్షపాతం తక్కువగానే ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గంగమ్మ ఇంకెంత లోతుకు వెళ్తుందోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే బోరుబావులపై ఆధారపడి సాగు చేసే పంటల పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోర్లల్లో నీటి ప్రవాహం తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు.
ఆరు నెలల్లోనే 3.32 మీటర్ల పతనం
గతేడాది వానాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురవడంతో అక్టోబర్ నాటికి సరాసరి 3.90 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉండేవి. అయితే యాసంగి సీజన్‌లో దాదాపు 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు కోసం బోరుబావులను విచ్చలవిడిగా వాడటంతో నీటిమట్టం వేగంగా పడిపోయింది. ఆరు నెలల వ్యవధిలోనే జూన్ చివరి నాటికి నీటిమట్టం ఏకంగా 7.54 మీటర్ల లోతుకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి నీటిమట్టం 7.14 మీటర్ల వద్ద ఉండేది.
ముఖం చాటేసిన వరుణుడు
జూన్‌లో కురిసిన కొద్దిపాటి వర్షాలు కేవలం మెట్ట పంటల సాగుకే సరిపోయాయి. జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి చుక్క నీరు కూడా చేరలేదు. మరోవైపు వరి నాట్ల కోసం రైతులు భారీగా నారుమళ్లు పోయడంతో బోర్ల వాడకం పెరిగింది. జూలై మొదటి 20 రోజుల్లో జిల్లాలోని 23 మండలాల్లో మోస్తరు వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ఈ నెలలో నీటిమట్టం మరింత వేగంగా పడిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాలుగు మండలాల్లో
ముంచుకొస్తున్న నీటి తిప్పలు
జిల్లాలోని చింతలపాలెం మండలంలో భూగర్భ జలాలు అత్యంత లోతుకు పడిపోయాయి. అక్కడ 14.92 మీటర్ల లోతులో నీరు ఉండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశముంది. అలాగే మేళ్లచెర్వు 13.26 మీటర్లు, తిరుమలగిరి 12.85 మీటర్లు, నూతనకల్ 10.33 మీటర్ల లోతులో ఉండడంతో ఆయా మండలాల్లో సాగు, తాగునీటికి కటకట ఏర్పడనుంది.
ఫ జూన్ చివరి నాటికి 7.54 మీటర్ల లోతుకు పడిపోయిన
భూగర్భ జలాలు
ఫ ఈనెలలోనూ వర్షాలు లేకపోవడంతో మరింత వెనక్కి..
ఫ గతేడాది కంటే తగ్గిన నీటిమట్టం
ఫ సాగు, తాగునీటిపై
తీవ్ర ప్రభావం చూపే అవకాశం


