
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
కోదాడ: కోదాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌లో పనిచేసే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న కలప వ్యాపారి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం రామాపురంతండాకు చెందిన సెనావత్ హరినాయక్ కలప వ్యాపారం చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం పనికిరాని చెట్లను కలప కోసం కొడుతుండగా అక్కడికి వెళ్లిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న వారిని అడ్డుకున్నాడు. తాను ప్రభుత్వానికి చలానా కడతానని కలప వ్యాపారి చెప్పాడు. ప్రభుత్వానికి రూ.60 వేలు చలానా కట్టాల్సివస్తుందని, తనకు రూ.50 వేలు ఇస్తే అన్నివిధాలా సహకరిస్తానని వెంకన్న చెప్పాడు. వ్యాపారితో చివరకు రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో అక్రమంగా కలప వ్యాపారం చేస్తున్నావని కేసులు పెడతానని బెదిరించాడు. అతని వేధింపులు తట్టుకోలేక హరినాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం కోదాడ సమీపంలోని ఒక హోటల్ వద్ద బాధితుడి నుంచి బీట్ ఆఫీసర్ వెంకన్న లంచం తీసుకొని తన బైక్ కవర్‌లో పెడుతుండగా అక్కడే మాటు వేసిఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం డబ్బులు స్వాధీనం చేసుకొని వెంకన్నను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఫ కలప వ్యాపారి నుంచి రూ.20వేలు
లంచం తీసుకుంటుండగా పట్టివేత