
నేడు, రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్‌రెడ్డి ఆది, సోమవారం రెండు రోజుల పాటు హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పాలకవీడు మండలం రాఘవాపురంలో, సాయంత్రం 4:15 గంటలకు హుజూర్‌నగర్ శివారులోని మగ్దుం నగర్‌లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు స్ధల పరిశీలన చేస్తారు. అనంతరం 5 గంటలకు హుజూర్‌నగర్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 6 గంటలకు పట్టణంలోని మంత్రి తన ఇంటికి చేరుకుని రాత్రి బస చేస్తారు. సోమవారం ఉదయం 8:40 గంటలకు పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో సిటీ స్కాన్, డయాలసిస్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించి, నూతన ఓపీ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ఎన్‌ఎస్‌పీ క్యాంప్‌లో నీటిపారుదల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభిస్తారు. విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మంత్రి కోదాడకు వెళతారు.
సీఎం, మంత్రులందరిదీ కమీషన్ పాలనే..
మఠంపల్లి: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రులందరిదీ కమీషన్ పాలనేనని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, హుజూర్‌నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మఠంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ సొంత నియోజకవర్గాల్లో రుణమాఫీ, రైతు భరోసా వందశాతం పూర్తిచేసినట్టు నిరూపించాలన్నారు. గతంలో ఎత్తిపోతల పథకాలను అడ్డుకున్న మంత్రి ఉత్తమ్ ఇప్పుడు పూర్తిచేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌పై ప్రజలకు ఎంత ప్రేమ ఉందో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తెలిసిపోతుందన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, మాజీ జెడ్పీటీసీ జగన్‌నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహరాజు, నాయకులు బీవీ రామారావు, హఫీజ్‌ఖాన్, పుల్లారెడ్డి, బాలాజీనీయక్, లక్ష్మీనరసింహారెడ్డి, సైదులు, కోటా నాయక్, జాలకిరణ్, నాగయ్యయాదవ్, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.