
మునుగోడులో ‘ప్లాస్టిక్’పై చైతన్యం
మునుగోడు: పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ కవర్లు మునుగోడు మండలంలో కనుమరుగయ్యాయి. మూడు నెలల క్రితం వరకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా వినియోగించేవారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మండల, గ్రామ స్థాయి అధికారులంతా రంగంలోకి దిగి ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపర్చారు. దీంతో మండలంలో దశలవారీగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని మానిపించారు. ప్రతి దుకాణాన్ని తనిఖీ చేస్తూ ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి చెక్ పెట్టారు. చాటుమాటుగా వినియోగిస్తున్న దాదాపు 30మందికిపైగా దుకాణాదారులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు జరిమానాలు విధించారు. దీంతో ప్రస్తుతం మండల వ్యాప్తంగా వివిధ దుకాణాల్లో చూద్దామన్నా ప్లాస్టిక్ కవర్లు కన్పించడం లేదు.