
స్వాతంత్య్ర వేడులకు ముస్తాబు
భానుపురి (సూర్యాపేట) : స్వాత్రంత్య దినోత్సవానికి సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముస్తాబయింది. శుక్రవారం ఉదయం 9గంటలకు కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 9:40కి ప్రసంగిస్తారు. 10 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులు, అతిథుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. 10.05కి విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. 10.20కి ప్రశంసా పత్రాలు అందజేస్తారు. 11.15కు స్టాళ్లను సందర్శించనున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ .. హుజూర్‌నగర్‌కు వెళ్లి వ్యవసాయ కళాశాల స్థలం విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తారు. సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.
భరద్రత పాటించడంలో నిర్లక్ష్యం వద్దు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని పరిశ్రమల్లో ఉద్యోగుల భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో ప్రమాదకర పరిశ్రమలపై వివిధ విభాగాల ఉన్నత స్థాయి అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించకుండా కంపెనీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఫ్యాక్టరీస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి సూర్యాపేటలోని సువెన్ ఫార్మా, నామవారంలోని పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, చివ్వెంలలోని రావూస్ ఫార్మా, నల్లబండగూడెంలోని ఫోరస్ ఫార్మా, కోదాడలోని మేఘ గ్యాస్‌లకు సంబంధించిన తనిఖీ వివరాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, ఇండస్ట్రీస్ జీఎం సీతారాం నాయక్, లేబర్ డిప్యూటీ కమిషనర్ అరుణ, బాయిలర్ ఇన్‌స్పెక్టర్ భీమారావు తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
సూర్యాపేటటౌన్ : బంగారం షాపుల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. బ్యాంకులు, బంగారం దుకాణాల భద్రతపై అధికారులు, బంగారం షాప్ యజమానులతో గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. వ్యాపారులు స్వీయ భద్రత చర్యలు పాటించాలన్నారు. బలమైన లాకర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలోజిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు రాజశేఖర్, నాగేశ్వరరావు, శివ శంకర్, నర్సింహారావు, సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది, బ్యాంకర్స్, యజమానులు పాల్గొన్నారు.