
సేంద్రియ సాగులో మేటి ‘వాసికర్ల’
సమీకృత సాగు మేలు
నడిగూడెం : ఎకరంన్నర విస్తీర్ణం కలిగిన భూమిలో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఏడాదంతా రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా వివిధ రకాల పంటల(సమీకృత)ను సాగు చేస్తున్నాడు నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు వాసికర్ల శేషు కుమార్. ఒక ప్రత్యేక షెడ్డులో పైన గొర్రెలు, కింద నాటుకోళ్లు పెంచుతున్నాడు. రెండు గుంటల భూమిలో చేపల పెంపకం చేపట్టాడు. ఇక మిగతా స్థలంలో ఉద్యానవన పంటలైన కొబ్బరి, నిమ్మ, బత్తాయి, మామిడి, జామ, సీతాఫలం, ఉసిరి, మునగ, దానిమ్మ, సపోట, అరటి, డ్రాగన్ ఫ్రూట్, లీచి, అంజీర, చింత, బంతి, కూరగాయల పంటలైన సొర, బీర, కాకర, బొంతు కాకర, వంగ, గోరుచిక్కుడు, పొట్ల, కీర, మిర్చి, టమాట, దోస, ప్రస్తుత సీజన్‌లో పెసర పంటను సాగు చేస్తున్నాడు. ఈ పంటల సాగుతో నాలుగేళ్లుగా ఏడాదికి రూ.5లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. ఈ పంటల సాగుకు జీవామృతం, ఘన జీవామృతం, పశువుల పేడ, నీమాస్త్రం, వేప నూనె తదితర వాటిని వాడుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మనతో పాటు, మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే వరికి బదులుగా సమీకృత వ్యవసాయ చేయాలి. తక్కువ స్థలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నాను. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధ పద్ధతులు పాటిస్తున్నాను.
– వాసికర్ల శేషు కుమార్, రైతు, సిరిపురం