
వరద జోరు..
సూర్యాపేట : రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరద జోరందుకుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. కొన్నిచోట్ల వరద లోలెవల్ బ్రిడ్జిల వద్ద ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. నాలుగు రోజుల పాటు జిల్లాకు భారీ వర్ష సూచన ఉండగా మూడోరోజు కాస్త విరామం ఇచ్చింది. దీంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కోదాడలోని షిరిడీసాయినగర్ కాలనీలోకి..
సూర్యాపేట పట్టణంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం వద్ద కల్వర్టుపై ప్రవహిస్తున్న నీళ్లలోంచి ఓ వ్యక్తి బైక్‌పై వెళ్లగా.. అదుపు తప్పడంతో బైక్‌ను అక్కడే వదిలి వచ్చాడు. మఠంపల్లి మండలం యాతావాకిళ్ల – హనుమంతులగూడెం ప్రధాన రహదారిపై వేములూరు వాగు బ్రిడ్డి పైకి వరద రావడంతో రాకపోకలు నిలిచాయి. హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ నల్లచెరువు అలుగు కారణంగా గోపాలపురం – బూరుగడ్డ రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. కోదాడ మండలం నల్లబండగూడెం – మంగల్‌తండా మధ్యలో వంతెనపై నీళ్లు ప్రవహించడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఆత్మకూర్ (ఎస్) నుంచి నెమ్మికల్ వెళ్లే దారిలో లోలెవల్ బ్రిడ్జిపై బుధవారం రాకపోకలు నిలిచిపోగా గురువారం సాగాయి. మేళ్లచెర్వు – కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. కోదాడ పెద్దచెరువు అలుగు పోయడంతో తమ్మర వాగునుంచి షిరిడీ సాయినగర్ కాలనీలోకి వరద చేరింది. పలు ఇళ్లు ముంపునకు గురయ్యాయి. కాలనీలోని పలు ఇళ్లను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పరిశీలించి కాలనీ వాసులతో మాట్లాడారు.