● తారాజువ్వ తగిలి కంటిని పోగొట్టుకున్న బాలిక
ఇచ్ఛాపురం: పట్టణంలో ఆదివారం దీపావళి వేడుకల్లో ప్రమాదం చోటుచేసుకుంది. దీపాల పండగ కోసం ఓ పాప కంటి చూపు పోయింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కొండివీధికి చెందిన ముడియా చంటి, బుజ్జిల కుమార్తె ముడియా లక్ష్మి స్థానిక మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇంటిలో సరదాగా దీపావళి సంబరం జరుపుకుంది. వీధిలో బాణసంచా కాల్చుతున్నారని ఇంటి వద్ద ఉన్న తన సైకిల్ని ఇంటికి కొంత దూరంలో ఉంచింది. సైకిల్కి తాళం వేసి ఇంటికి వస్తుండగా వీధిలో ఎవరో కాల్చిన తారాజువ్వ వంటిది నేరుగా వచ్చి చిన్నారి కంటిని తాకింది. దీంతో ఆమె కంటికి తీవ్ర గాయమైంది. వెంటనే చిన్నారి కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ప్రైవే టు ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ మెడికవర్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది వెంటనే ఆపరేషన్ చేసి చిన్నారి ఎడమ కంటిని తొలగించారు. ఈ సంఘటన చిన్నారి కుటుంబ సభ్యులను, ఊరి వారిని తీవ్రంగా కలిచివేసింది.


