● ఏపీ మోడల్ జూనియర్ కళాశాలల్లో వంట నిర్వాహకులు ఆందోళన
● వడ్డీలకు అప్పులు తెచ్చి వండినా బిల్లులు మంజూరు కావడం లేదని ఆవేదన
● రెండేళ్లుగా అందని మధ్యాహ్న భోజన బిల్లులు
జి.సిగడాం :
ఆంధ్రప్రదేశ్ మోడల్ జూనియర్ కాలేజీ(ఆదర్శ విద్యాలయాలు)ల్లో మధ్యాహ్న భోజనం వంట బిల్లులు మంజూరు కాక నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి వండిపెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం సరికాదని వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా 13 ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సుమారు 2,500 మంది వరకు ఉన్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. భోజన ఖర్చుల కోసం ఒక్కొక్క విద్యార్థి 9 రూపాయల 95 పైసలు మంజూరు చేయాల్సి ఉంది. అయితే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నప్పటికీ రెండేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
ధరల మోత..
మార్కెలో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ధరలు భగ్గుమంటున్నాయి. నూనె కేజీ రూ.190, చింతపండు కేజీ రూ.70, పప్పు కేజీ రూ.150, కూరగాయలు కిలో 50 రూపాయలకు పైగా ధర పలుకుతున్నాయి. రెండేళ్లుగా వంట చేయడానికి గ్యాస్ ఖర్చులు సైతం భరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం బియ్యం, గుడ్లు మాత్రమే అందిస్తోంది. మిగతా వస్తువులన్నీ నిర్వాహకులు అధిక వడ్డీకి అప్పులు చేసి మెనూ ప్రకారం పథకం అమలు చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమకు వంట బిల్లులు మంజూరు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.


