కాశీబుగ్గ, ఇచ్ఛాపురం :పుర సమరంలో నేడే అంతిమ తీర్పు వెలువడనుంది. పురపాలికను ఏలేదెవ్వరన్నది మంగళవారం మధ్యాహ్నానికల్లా తెలిసిపోనుంది. ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడిన రాజకీయ పక్షాల భవితవ్యాన్ని ఓట్ల లెక్కింపు తేల్చనుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొత్తం 34,667 మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమై ఉంది. మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పీఠాన్ని ఆశిస్తున్న ఐదుగురు అభ్యర్థులతో పాటు 36 స్థానాలకు పోటీపడుతున్న 73 మంది కౌన్సిలర్ అభ్యర్థుల రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. ఇక ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 20,616 మంది ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పీఠానికి నలుగురు పోటీ పడుతుండగా 28 వార్డులకు గాను అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.
సాయంత్రం ఐదింటికల్లా స్పష్టత
ఉదయం 8 గంటలకు ఓట్లలెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటల కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కౌన్సిలర్ స్థానాల్లో వచ్చే ఫలితాలు చైర్‌పర్సన్ పీఠం విషయంలో కీలకంగా మారనున్నాయి.
పలాస, ఇచ్ఛాపురంలలో
ఓట్ల లెక్కింపు
సాయంత్రం ఐదింటికల్లా ఫలితాలు
ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ


