● సాయంత్రం 5 తర్వాత ప్రచారాలన్నీ ఆపాల్సిందే
● స్థానికేతరులంతా స్థానిక ప్రాంతాలను వీడివెళ్లాలి
● పోలింగ్ ముగిసేంత వరకు మద్యం విక్రయాలకూ బ్రేక్
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
అరసవల్లి: పల్లెల్లో పరిషత్ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రంతో గడువు తీరనుంది. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల స్థానాలకు ఈనెల 5న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంట ల నుంచి తెరపడనుంది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచే ప్రచార గడువు ముగుస్తుందని, ఈ మేరకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులంతా ఈ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రకటించారు. అలాగే జిల్లాలో ఎన్నికలు జరిగే సంబంధిత ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఓటు హక్కు లేని రాజకీయ నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు ఆయా ప్రాంతాలను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అలాగే మండల కేంద్రాల్లో లాడ్జిలు, కల్యా ణ మండపాలు, కమ్యూనిటీ భవనాలు, పైవేటు వసతి గదుల్లో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా బయట వ్యక్తులు ఆశ్రయం పొందితే.. వారిపై, అలాగే ఆ యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్ర చారాలతో పాటు మైకుల వినియోగం, ర్యాలీలు, రోడ్‌షో లపై ఆంక్షలు అమల్లోకి వస్తాయని, ఇలాంటి ప్రచారాలు సైతం ఎన్నికల నిబంధనల అతిక్రమణలోకి వస్తాయని గుర్తుచేశారు. సోషల్ మీడియాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే సందేశాలు పంపడంపై సైబర్ విభాగం గట్టి నిఘా ఉంచుతుందని పేర్కొన్నారు. ప్రచారాల ముగింపు నుంచి మద్యంపై నిషేధం ఉంటుందన్నారు.


