నరసన్నపేట: మండలంలోని గుండవల్లిపేటలో ఎన్‌హెచ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న చంద్రమౌళీశ్వరాలయంతో పాటు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలో సోమవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈశ్వరాలయం వెనుక ఉన్న గదిలో భద్రపరిచిన వివిధ వెండి అలంకరణ వస్తువులు, చిన్న విగ్రహాలు దొంగలించారు. ఈ వస్తువులు అరకేజీ వరకూ ఉంటాయని అంచనా. అలాగే అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఉన్న హుండీలో డబ్బును కొల్లగొట్టారు. ఈ మేరకు అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్లూస్ టీం సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు.
మల్లన్న ఆలయంలో చోరీ
● ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన
టెక్కలి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి దేవాలయంలోని హుండీ చోరీకి గురైనట్లు సోమవారం ఆలయ సిబ్బంది గుర్తించారు. ఆలయంలోని హుండీ గత నెల 29వ తేదీన వర్షం పడుతుండడం వలన విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు హుండీ తాళం విరగొట్టి నగదు చోరీకి పాల్పడి ఉంటారని సిబ్బంది భావిస్తున్నారు. అయితే గత నెల 29వ తేదీన చోరీ జరిగినప్పటికీ ఇంతవరకు దానిని గుర్తించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఆలయంలో సీసీ కెమెరాలు సైతం కొద్దిరోజులుగా పని చేయకపోవడంతో భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ చోరీ విషయాన్ని గ్రామస్తులకు సైతం తెలియకుండా గోప్యంగా ఉంచడానికి కారణమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
సత్యనారాయణకు గుర్తింపు
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళంనకు చెందిన డోలు విద్యాంసుడు ఆచంటి సత్యనారాయణ ఆల్ ఇండియా రేడియో సంగీత పరీక్షల్లో (ఆకాశవాణి) ‘ఏ– గ్రేడ్’ సర్టిఫికెట్ సాధించారు. విజయనగరంలోని సంగీత కళాశాలలో డోలు విద్వాంసునిగా డిప్లొమా పూర్తిచేసి, విశాఖపట్నంలోని కుర్మాపు గోవిందరావు శిక్షణలో శిష్యుడుగా ఉన్నారు. సత్యనారాయణకు సిక్కోలు సంగీత కళాకారులు, కిల్లపాలెం గ్రామ పెద్దలు, ప్రజలు అభినందనలు తెలియజేశారు.
సత్తాచాటిన విద్యార్థులు
ఎచ్చెర్ల: శ్రీకాకుళం ఆర్‌జీయూకేటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్విస్కిట్ ఫాల్ ఫెస్ట్–2026లో భాగంగా హ్యాక్‌థాన్ కార్యక్రమాన్ని ఘనంగా సోమవారంతో ముగించారు. దీనిలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు రోజులు పాటు కొనసాగిన ఈ సాంకేతిక ఉత్సవంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖ వ్యక్తలు, క్వాంటమ్ రంగ నిపుణులు పాల్గొని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తమ అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులను నూతన సాంకేతిక పరిజ్ఞానం క్వాంటమ్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించారు. ఈ హ్యాకథాన్‌లో ఆర్జీయూకేటీ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కై వసం చేసుకొని సత్తాచాటారు. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, పరిపాలనాధికారి డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, డీన్ డాక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


