శ్రీకాకుళం పాతబస్టాండ్: విద్యార్థినులు చట్టాలపై సమగ్ర అవగాహన పెంచుకున్నప్పుడే సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలరని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నవంబర్ 9న జరిగే న్యాయసేవా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం నగరంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలు, నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం అందుతుందని, అవసరమైన వారు 15100 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని సూచించారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, పోక్సో చట్టం ద్వారా చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. గృహహింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టాలు, షీ టీమ్స్ సేవలపై వివరిస్తూ, కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు చెప్పకూడదని హెచ్చరించారు. సైబర్ మోసాలు జరిగితే తక్షణమే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వివాదాలను రాజీ మార్గంలో వేగంగా, పైసా ఖర్చు లేకుండా పరిష్కరించుకోవడానికి డిసెంబర్‌లో జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆపద సమయాల్లో పోలీసు సహాయం కోసం 100, మహిళా హెల్ప్‌లైన్ 181, చిన్నారుల రక్షణకు 1098 నంబర్లను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్, ప్యానెల్ న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


