సంతబొమ్మాళి: రాజకీయ కక్షను పచ్చని పంట పొలంపై టీడీపీ నాయకుడు చూపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త వాదాల దుర్గారావుకు చెందిన వరిపొలం గట్టును.. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నరికివేశాడని బాధితుడు చెబుతున్నాడు. గట్టు తొలగించడంతో ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మొత్తం పక్కనే ఉన్న పచ్చని వరిచేలపైకి చేరి పంటకు నష్టం వాటిళ్లిందని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. గట్టు నరికివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన కూలీలను పెట్టి బస్తాలతో తాత్కాలికంగా గట్టును పునరుద్ధరించుకున్నారు. అయితే రాజకీయ విభేదాలను వ్యక్తిగతంగా తీసుకుని పంటపొలాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతుల కష్టాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


