కంచిలి: దసరా ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రం కంచిలిలో కొలువై ఉన్న కంచమ్మతల్లి అమ్మవారు నిజరూపంలో గురువారం భక్తుల కు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
వజ్రపుకొత్తూరు రూరల్ : ెపద్దబొడ్డపాడు పంచాయతీ పరిధిలో ఉన్న సీతాపురంలో కొంతకాలంగా ఉన్న భూ వివాదం రెవెన్యూ, పోలీసుల అధికారుల చొరవతో పరిష్కారమైంది. తరతరాలుగా వస్తున్న భూమి హద్దుల విషయంలో బంధువుల మధ్య జరుగుతున్న ఈ వివాదంపై బాధితురాలైన బి.శ్రావణి ఇటీవల జిల్లా కలెక్టర్, ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందించారు. ఈ మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు గురువారం సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ కె.ఢిల్లీరావు మాట్లాడుతూ భూ వివాదాలతో ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదన్నారు.
పాతపట్నం : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.ఎన్.వి.నరేష్కుమార్ వైద్య సిబ్బందికి సూచించారు. పాతపట్నం మండ లం గంగువాడ పీహెచ్‌సీని గురువారం సందర్శించారు. ఫార్మసీ, లేబొరేటరీ, ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగాలను పరిశీలించారు. రికార్డుల ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా సిబ్బందితో డాక్టర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. పీహెచ్సీలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ హిమశ్రీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
టెక్కలి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల 12, 13, 14వ తేదీలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 70వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 14 ఏళ్ల బాలికల 35 కిలోల విభాగంలో మెండ తపస్వి, బాలుర విభాగంలో గిన్ని దీపక్ రెడ్డి, 17 ఏళ్ల విభాగంలో జనపాన వాగ్దేవి అక్షయలు బంగారు పతకాలు సాధించారు. వీరంతా హిమాచల్‌ప్రదేశ్, శ్రీనగర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ నర్శిపురం శేఖర్ గురువారం తెలిపారు. గిన్ని దిలీప్‌రెడ్డి రజత పతకం సాధించినట్లు చెప్పారు.
గార : వాడాడ గ్రామానికి చింతనిప్పుల లలిత (24) అనుమానాస్పదంగా మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లలిత గురువారం ఉదయం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయిందని కుటుంబ సభ్యులకు పెద్దమామ ఫోన్లో సమాచారమిచ్చాడు. వెంటనే తల్లిదండ్రులు వాడాడ వచ్చేసరికి లలిత మృతదేహం మంచంపై ఉండటంతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. లలిత భర్త రమేష్‌కు వివాహేతర సంబంధం ఉందని, పెద్ద మనుషుల సమక్షంలో తగువులు కూడా జరిగాయని, భర్తే ఏదైనా చేసి ఉంటాడని అనుమానంగా ఉందని తండ్రి దుర్గయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐ సీహెచ్.గంగరాజు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. లలితకు రిషి అనే కుమారుడు ఉండగా, ప్రస్తుతం మూడు మాసాల గర్భిణి. తండ్రి దుర్గయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గంగరాజు తెలిపారు.


