సిక్కోలు ఆతిథ్యంలో.. రాష్ట్రస్థాయి యోగా పోటీలు | - | Sakshi
Sakshi News home page

సిక్కోలు ఆతిథ్యంలో.. రాష్ట్రస్థాయి యోగా పోటీలు

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

సిక్కోలు ఆతిథ్యంలో.. రాష్ట్రస్థాయి యోగా పోటీలు ● డీఈఓ నేతృత్వంలో నిర్ణయించిన ఎస్‌జీఎఫ్‌ ప్రతినిధులు, కమిటీ సభ్యులు ● నరసన్నపేట మండలం సత్యవరం వేదికగా నిర్వహణ

● డీఈఓ నేతృత్వంలో నిర్ణయించిన ఎస్‌జీఎఫ్‌ ప్రతినిధులు, కమిటీ సభ్యులు ● నరసన్నపేట మండలం సత్యవరం వేదికగా నిర్వహణ

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఆతిథ్యంలో ఈ ఏడాది మొదటి స్టేట్‌మీట్‌కు రంగం సిద్ధమైంది. రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ పోటీల్లో భాగంగా మొదటి ఫేజ్‌లో యోగా క్రీడాంశంలో పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వేదికగా నవంబర్‌ 5 నుంచి 7వ తేదీ వరకు పోటీలు జరిపించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు నేతృత్వంలో గురువారం జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూరాష్ట్రస్థాయి పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. వివిధ జిల్లాల నుంచి పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు, జిల్లా పీడీ–పీఈటీ సంఘ నాయకులు సమష్టిగా పనిచేసి పోటీలను విజయవంతం చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

జిల్లా నుంచి 10 మంది చొప్పున..

ఈ పోటీలకు జిల్లా నుంచి పది మంది(ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు) చొప్పున ఈ పోటీలకు క్రీడాకారులు హాజరవుతారని జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శులు చల్లా జగదీష్‌, జీఎం జ్యోతిరాణి తెలిపారు. 13 జిల్లాల నుంచి మొత్తం 130 మంది బాలబాలికలు పోటీలకు హాజరవుతారని చెప్పారు. సత్యవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వేదికగా జరిగే ఈ పోటీలకు హాజరయ్యే బాలబాలికలకు అక్కడే వసతి, భోజన ఏర్పాట్లు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ పోటీల అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆతిథ్యంలో చెస్‌, అండర్‌–14 బాలుర క్రికెట్‌ టోర్నీలను సైతం నిర్వహించాలని ప్రతిపాదించినట్టు వారు గుర్తుచేశారు. సమావేశంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, గ్రిగ్స్‌ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, కె.మాధవరావు, సాదు శ్రీనివాసరావు, సతీష్‌రాయుడు, గురుగుబెల్లి రాజశేఖర్‌, ఈశ్వరరావు, రెడ్డ రవి, ఇమ్రాన్‌ బేగ్‌, రేణుక, సుశీల, మండల స్పోర్ట్స్‌ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement