● మద్యం మత్తులో యువకుడి దుశ్చర్య ● విలపించిన భక్తులు
ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామం చీకటి బలరాంపురం గ్రామదేవత బోదమ్మతల్లి విగ్రహాన్ని మద్యం మత్తులో ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ దుశ్చర్య స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శరన్నవరాత్రులు సందర్భంగా బోదమ్మ అమ్మవారి ఆలయం వద్ద గ్రామ మహిళలు భవానీమాలలు ధరించి పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి యధావిధిగా పూజలు చేసి ఇంటికి వెళ్లిపోయారు. ఇంతలో ఒడిశా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆలయంలోకి చొరబడ్డాడు. హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించిన క్రమంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తుండగా స్థానికులు గమనించారు. దుండగుడిని అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు. విగ్రహం ధ్వంసం కావడంతో భవానీమాల దీక్షలో ఉన్న మహిళలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆలయం చుట్టుపక్కల ఒడిశా సారా ప్యాకెట్లు, మద్యం అమ్మకాలు చేస్తుండటంతో మద్యం మత్తులో ఇటువంటి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


