అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఇటీవల వింతపోకడలు ఎక్కువయ్యాయి. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాలకు సేవ చేయండని పాలకమండలి సభ్యుని(ధర్మకర్త)గా నియమిస్తే.. సదరు ధర్మకర్త సేవ పేరిట డబ్బులు దండుకుంటున్న వైనం గురువారం వెలుగులోకి వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓ ఎనిమిది మంది భక్తుల సమూహానికి అంతరాలయ దర్శనం చేయిస్తానంటూ తన హోదా ప్రదర్శించి రూ.1500 వరకు దర్శన ఖర్చులు పేరిట దండుకున్నారంటూ చర్చ జోరందుకుంది. ఽగతంలో ఎన్నడూ లేనివిధంగా ధర్మకర్తల హోదాలో ఉంటూ ఇలా దర్శనాలు చేయిస్తామంటూ డబ్బులు వసూళ్లు చేయడంపై స్థానికులు, భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చేష్టలపై మండిపడుతున్నారు. ఇదిలావుంటే తాము బయట ఓ వ్యక్తికి అంతరాలయ దర్శనం కోసం డబ్బులిచ్చామంటూ ఆలయ పరిసరాల్లో సిబ్బందితో చిన్నపాటి వాదనతో ఈ వ్యవహారం బయటపడిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. తాజా ఘటనతో ధర్మకర్తా..ఇది తగునా..?అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఆలయ దర్శనాలు సౌకర్యవంతంగా సజావుగా జరిగేలా చేయాల్సిన ఆలయ ఈవో..ఇవేవీ పట్టకుండా కేవలం భూముల బదలాయింపు, టెండర్లు తదితర ఆర్థిక వ్యవహారాలపై మాత్రమే శ్రద్ద వహించడంతోనే ఇలాంటి డబ్బుల దర్శనాలు ఎక్కువయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మెళియాపుట్టి: గొడ్డ గ్రామానికి వెళ్లే రహదారిలో నిత్యం మురుగునీరు ప్రవహిస్తుండటంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి మండలంలోని పలు గ్రామాల రహదారుల్లో నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువల నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


