శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల విధుల నిర్వహణలో లోపాలు జరగరాదని కలెక్టర్, జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లలో భాగంగా గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లతో ఫేజ్–1 ఎన్నికల నిర్వహణపై శిక్షణ సమావేశం వీడియో ప్రదర్శన ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సంబంధిత అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫారం –బి, ఫారం–7 పరిశీలనలో పొలిటికల్ పార్టీ కేటగిరీ వారీగా పరిశీలించి, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని, హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పలాస, ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్లు, శ్రీనివాసరావు, రమేష్, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాలరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


