వన్టౌన్(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వేళ శ్రీకాకుళం పట్టణానికి చెందిన కుటుంబం గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మకు బంగారు కిరీటం కానుకగా సమర్పించింది. రూ.75 లక్షల వ్యయంతో ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో సుందరంగా తయారు చేయించిన 494 గ్రాముల బరువు గల నవరత్న కచిత బంగారు కిరీటాన్ని శ్రీకాకుళానికి చెందిన భక్తుడు కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె.దుర్గా శ్రీనివాస్ అమ్మవారికి సమర్పించారు. ఆలయ ఈఓ కె.శీనానాయక్, దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి.త్రినాథరావు సంయుక్తంగా ఈ కానుకను స్వీకరించారు. అనంతరం దాత కుటుంబసభ్యులకు అంతరాలయంలో అమ్మ వారి ప్రత్యేక దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అనంతరం అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా భక్తుడు దుర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గమ్మ దయవల్లే తాము ఈ కానుకను సమర్పించుకోగలి గామన్నారు.


