సారవకోట : బొంతు గ్రామ సమీపంలో కొండ వద్ద మంగళవారం రాత్రి నక్కను కొండచిలువ మింగడాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజాము వరకు చుట్టుకునే ఉండటం గమనార్హం. ఆ తర్వాత కొండ ప్రాంతానికి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు.
టెక్కలి రూరల్: శాసనం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. కొండతెంబూరు గ్రామానికి చెందిన టి.జంగమయ్య నడుచుకుంటూ గ్రామ సమీపంలోని చెరువు వద్దకు స్నానానికి వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పడి ఉన్న వృద్ధుడిని గుర్తించిన స్థానికులు వెంటనే 108లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.
ద్విచక్ర వాహనాల చోరీపై దర్యాప్తు
శ్రీకాకుళం క్రైమ్ : రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన నలుగురు మైనర్లను ఒకటో పట్టణ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వాంబేకాలనీకి చెందిన టేకు మాధవ్, సంతోష్ల నివాసగృహాల ముందు పార్కింగ్ చేసిన టీవీఎస్ ఎక్స్ఎల్, హీరో ప్లెజర్ ద్విచక్రవాహనాలను మైనర్లు మంగళవారం దొంగిలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బుధవారం విజుబుల్ పోలీసింగ్లో భాగంగా తనిఖీలు చేపట్టగా ఒకటో పట్టణ పరిధిలోనే దొంగిలించిన బైక్లపై వెళ్తూ మైనర్లు తారసపడ్డారు. దీంతో స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. నలుగురూ మైనర్లు కావడంతో ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి వారి సూచనల మేరకు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
కొత్తమ్మ తల్లి ఆలయానికి
అప్పన్న రథం
సింహాచలం: కోటబొమ్మాళిలో జరుగుతున్న కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలకు సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ప్రచార రథం బుధవారం తరలివెళ్లింది. దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ పి.సూరిబాబు పర్యవేక్షణలో వైదికులు, సిబ్బంది రథంతో పాటు బయల్దేరారు. ఉత్సవాల్లో భాగంగా జరిగే శోభాయాత్రలో ప్రచార రథం పాల్గొననుంది. రథంలోని స్వామివారి మూలవిరాట్, ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకోనున్నారు.


