గార : నిత్యం మద్యం తాగి వస్తుండటంతో కుటుంబ భవిష్యత్ ఏమవుతుందని భార్య నిలదీయడంతో ఓ వ్యక్తి మనస్థాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతివాడ పంచాయతీ యాళ్లపేట గ్రామానికి చెందిన యాళ్ల షణ్ముఖరావు (42) మూడేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 6న గ్రామంలో వారాలు జరుగుతుండగా మద్యం మత్తులో ఇంటికి రావడంతో భార్య మందలించింది. ఆ తర్వాత కాసేపటికే వాంతులు చేసుకోవడంతో గమనించగా, పారాపెట్ అనే కలుపు మందును తాగినట్లు గుర్తించారు. వెంటనే రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. షణ్ముఖరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ రవిబాబు తెలిపారు.


