జగనన్న కాలనీలపై కక్షసాధింపు సరికాదు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్ఎస్కు 160 ఫిర్యాదులు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రజల అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ను సోమవారం నిర్వహించారు. మొత్తం 160 వినతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖ వినతులు 84, పంచాయతీ రాజ్‌శాఖ 17, విద్యుత్ శాఖ 7, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌కు సంబంధించి 6, జలవనరుల శాఖ 6, బీసీ వెల్ఫేర్ 2, శ్రీకాకుళం కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి 10, పలు శాఖలకు సంబంధించిన వినతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేడీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ట్రైనీ కలెక్టర్, డీఆర్వో తదితరులు పాల్గొన్నారు. పలు వినతులు పరిశీలిస్తే...
కబ్జాదారుల నుంచి కాపాడండి
ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామ పరిధిలో తమ్మినేని చెల్లన్న పేరుమీద ఉన్న 75 సెంట్ల భూమిని ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు కబ్జా చేశారని చెల్లన్న వారసులు తమ్మినేని అజయ్‌కుమార్, వెంకటరావు, అమ్మినాయుడు, పాపారావు, చంద్రరావులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ కొత్తకోట పూర్ణచంద్రరావు, పైడి వేణుగోపాలరావు, పైడి రామారావులతో పాటు మరికొంతమంది దౌర్జన్యం చేసి తమ భూమిని కబ్జా చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మోసాలు అరికట్టాలి
ఆర్మీ కాలింగ్ సెంటర్ డైరెక్టర్ బసవ రమణ ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామస్తుడు పాలిశెట్టి కొండలరావు అన్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని అక్షరాలా రూ.5.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని కలెక్టర్‌కి విన్నవించారు. రమణపై తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
ఆదుకోండయ్యా
సీనియర్ జర్నలిస్ట్ పైల శ్రీనివాసరావు గత కొంతకాలంగా కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యుల సలహా నిమిత్తం పూర్తిగా కాలేయం మార్పిడి చేయడానికి రూ.35 లక్షలు ఖర్చవుతుంది. దీంతో తమకు సాయం చేయాలని శ్రీనివాసరావు భార్య, పిల్లలు కలెక్టర్‌కి విన్నవించారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి తన వంతు సాయమందిస్తానని భరోసానిచ్చారు.
దివ్యాంగత్వం తగ్గించేశారు
ఆమదాలవలస మండలం అక్కులపేటకు చెందిన యాళ్ల లింగరాజుకి దివ్యాంగత్వం 75 శాతంగా 2018లో సర్టిఫికేట్ జారీచేసి ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి నాయకుల ఒత్తిళ్లతో డాక్టర్లు పూర్తిగా దివ్యాంగత్వం లేదని చూపించడం అన్యాయమని లింగరాజు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద మండుటెండలో బోరున విలపించాడు. కలెక్టర్ స్పందించి తనను ఆదుకోవాలని కోరారు.
పాస్ పుస్తకంలో నమోదు చేయాలి
సోంపేట మండలంలోని రుషికుడ్డ గ్రామంలో రైతులకు బీడీఆర్ భూములు సర్వే చేసి పాస్ పుస్తకంలో నమోదు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యుడు సంగారు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సర్వే చేసి పాస్ పుస్తకంలో నమోదు చేయకపోవడం వల్ల అన్నదాత సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ, ఇతర సంక్షేమ పథకాలు అమలు జరక్క రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ని కలిసినవారిలో రుషికుడ్డ భూ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, మాజీ సర్పంచ్‌లు కె.కామేశ్వరరావు, సంధి రాజు, సంధి దామోదరం, సంధి మధుసూదన, తప్పల జానకిరావు, గేదెల సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కుశాలపురంలోనే కొనసాగించాలి
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజనలో భాగంగా యాతపేటను కుశాలపురం నుంచి విడగొట్టకుండా చూడాలని కలెక్టర్‌కి వినతిపత్రం అందించారు. తమ డివిజన్‌తో సంబంధం లేని దూర ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్లు దాటి సచివాలయం, రేషన్, స్కూల్స్‌కి వెళ్లాల్సి వస్తుందని.. దీనిని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా కూటమి నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని వైఎస్సార్సీపీ యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య అన్నారు. నరసన్నపేట పట్టణంలోని జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పీజీఆర్ఎస్లో సోమవారం వినతి అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ నరసన్నపేట పట్టణంలోని జగనన్న కాలనీలో నివసిస్తున్న ప్రజలు తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, విద్యుత్ దీపాలు, శ్మశానవాటికలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలనీలో నివసిస్తున్న కుటుంబాల సమస్యలను ప్రభుత్వం గుర్తించి, వారికి అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. కలెక్టర్‌ని కలిసినవారిలో వైఎస్సార్సీపీ కాళింగ కుల బీసీ విభాగం అధ్యక్షుడు ఆరంగి మురళీధర్, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బూరల్లి శంకర్రావు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దండి జయప్రకాష్, నియోజకవర్గ పంచాయతీ రాజ్ అధ్యక్షుడు బగ్గు రమణయ్య, పట్టణ అధ్యక్షుడు పొట్నూరు సాయి ప్రసాద్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాగోటి భరత్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు నేతింటి రాజేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ మార్పు విజయ్‌కుమార్, నాగవంశపు డేవిడ్, జిల్లా మహిళా కార్యదర్శి సవర శైలజ, మండల మహిళా కార్యదర్శి మరువాడ సుధారాణి తదితరులు ఉన్నారు.


