ముగ్గురి మృతిపై తీవ్ర చర్చ..
పోలాకి: మండలంలో తీరప్రాంత గ్రామాల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. గత నెలలో కురిసిన వర్షాల తర్వాత వాతావరణ పరిస్థితిలో వచ్చిన మార్పులు కారణంగా వ్యాధుల తీవ్రత పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ల కారణంగా చిన్నారులు, వృద్ధులతోపాటు, ఇమ్యునిటీ తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ప్లేట్లెట్స్ తగ్గిపోయి విషజ్వరాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ముఖ్యంగా గుప్పెడుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో గుల్లవానిపేట, కొత్తరేవు, జోగంపేట, గుప్పెడుపేట, రాజపురం, బెలమర, కోడూరు, డీఎల్పురం, మగత పాడు గ్రామాల్లో జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నారు.
ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు..
తీరప్రాంత గ్రామాల నుంచి నేటికీ పదుల సంఖ్యలో జ్వరపీడితులు నరసన్నపేట, శ్రీకాకుళం పట్టణాల్లోని ప్రైవేటు క్లినిక్లు, ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. గుప్పెడుపేట పీహెచ్సీ వైద్యాధికారి తీరుపై ఇప్పటికే స్థానికుల నుంచి విమర్శలు రావడంతో శాఖాపరమైన విచారణ జరుగుతుందని సమాచారం. పోలాకి మండల కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగి సేవలు చేస్తేగానీ అక్కడి సిబ్బంది పట్టించుకోరని ప్రజల విమర్శలున్నాయి. ఇటీవల ఓ చిన్నారికి చేసిన వైద్యం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
జోగంపేట గ్రామంలో నెలరోజుల వ్యవధిలో మురబంద ప్రభావతి(45), గుంటు అంకమ్మ(50), పుక్కళ్ళ గురమ్మ(35) అనే మహిళలు మృతి చెందడం కలకలం రేపుతోంది. సదరు మహిళలు జ్వరంతో బాధపడుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు చెబుతుంటే, ఇతర అనారోగ్య కారణాలతో మృతిచెందారని వైద్యసిబ్బంది తేల్చేస్తున్నారు.
విషజ్వరాలతో వణుకుతున్న పోలాకి మండల ప్రజలు
జోగంపేటలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు మహిళలు మృతి
ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో జ్వరపీడితులు


