లావేరు: మండలంలోని బొడ్డపాడు వద్దనున్న మాతాశ్రమం సమీప తోటల్లో గంజాయి సేవిస్తున్న 12 మందిని లావేరు పోలీసులు ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకుని సోమవారం అరెస్టు చేశారు.
ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో జేఆర్‌పురం సీఐ అవతారం, లావేరు ఎస్ఐ సందీప్‌కుమార్ వివరాలు వెల్లడించారు. మాతాశ్రమం సమీపంలో ఆదివారం సాయంత్రం కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారని, అలాగే వారి వద్ద కొంత మేరకు గంజాయి ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో గంజాయి సేవిస్తున్న ఘటనా స్థలానికి లావేరు ఎస్ఐ వి.సందీప్ కుమార్ కొంతమంది పోలీసులు వెళ్లగా.. వీరిని చూసి నలుగురు వ్యక్తులు అక్కడినుంచి పరారయ్యారు. మరో 12 మంది ఘటనా స్థలంలోనే పోలీసులకు పట్టుబడ్డారు. అరైస్టెనవారిలో మహతా రాజు, మహతా ముఖేష్ (పైడిభీమవరం), కోలా హర్షవర్ధన్ (లావేరు మండలం బెజ్జిపురం), సురావరపు వరప్రసాద్(జేఆర్‌పురం), పిన్నింటి చంటి (జేఆర్‌పురం) సీరపు కాసిక్ (ఎచ్చెర్ల మండలం జరజాం), సవలాపురపు వంశీ (ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట), పెద్ది దుర్గా ప్రసాద్(ఎచ్చెర్ల), ధర్మాన నరేంద్రం నాయుడు(నరసన్నపేట), లోలుగు గోవిందరాజు(లావేరు మండలం మురపాక), పొట్నూరు అమృత రాజు (ఎచ్చెర్ల మండలం ముద్దాడ), కందుకూరి కిషోర్ (లావేరు మండలం పెదరావుపల్లి) ఉన్నారు. వీరి వద్దనుంచి 2 కేజీల 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద బీహార్ జార్ఖాండ్ దాబాను బీహార్‌కు చెందిన అన్నదమ్ములు మహతా రాజు, మహతా ముఖేష్‌లు నడుపుతున్నారు. వీరు ఆ దాబాకు తరుచుగా వచ్చిపోయే లారీ డ్రైవర్ల వద్ద గంజాయి తీసుకొని యువతకు అమ్మకం చేపట్టేవారని పోలీసులు తెలిపారు. ఆరైస్టెనవారిలో ఇప్పటికే కొంతమందిపై గతంలోనూ గంజాయి కేసులు ఉన్నాయని సీఐ చెప్పారు. అలాగే 5 మంది వరకు బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు.


