సంతబొమ్మాళి: అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములను కొంతమంది యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. మండలంలో పోతునాయుడుపేట రెవెన్యూ పరిధిలోని హనుమంతునాయుడుపేట గ్రామంలో సర్వే నంబర్లు 334, 335లో ఉన్న సుమారు 70 సెంట్ల ప్రభుత్వ భూమిని టీడీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ కబ్జా చేశారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి విలువ రూ.కోటి పైగా ఉంటుంది. గతంలో ఈ ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీ నిర్మాణానికి కేటాయించారు. సరిహద్దులు కూడా పోల్చారు. అయితే స్థానిక నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ముందుకు సాగలేదు. దీంతో ఖాళీగా ఉన్న ఈ భూమిపై టీడీపీ నాయకుడి కన్ను పడింది. సదరు భూమిని ఆక్రమించి జీడి మామిడి మొక్కలు నాటారు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై సంబంధిత రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణను తొలగించాలని కోరుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ భూమిని కాపాడి, ఆక్రమమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వీఆర్వో సాయిని అడగగా తన దష్టికి రాలేదని, ఫిర్యాదు వస్తే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానన్నారు.


