శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదిక (గ్రీవెన్సు)లో బాధితుల నుంచి 74 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులను స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. ఫిర్యాదులు ఎక్కువ శాతం భూ కబ్జాలు, ఆర్థిక లావాదేవీలు అంశాలపైనే ఉండడం విశేషం.
● సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురానికి చెందిన కుమ్మరి మోహన కృష్ణ అనే దివ్యాంగుడు తన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకోవదానికి అదే గ్రామానికి చెందిన చీడివలస అప్పన్న, చీడివలస లక్ష్మణరావు, చీడివలస యల్లమ్మలు యత్నిస్తున్నారని, కొట్టి చంపడానికి చూశారని ఫిర్యాదు చేశారు. చీడివలస లక్ష్మణరావు అతని వెనుక కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నాడని భయపెడుతున్నాడని వాపోయాడు.
● బంగారం తనఖా పెట్టి రుణం తీసుకున్నాక అధిక వడ్డీ డబ్బులు వేయడమే కాకుండా.. ఆరు నెలలైనా నిండకముందే వేలానికి వేస్తామని కాశీబుగ్గలోనున్న కీర్తన ఫిన్సెర్వ్ లిమిటెడ్ మేనేజర్ బెదిరిస్తున్నారని పద్మనాభపురం కాలనీకి చెందిన అలజింగి దీక్ష ఫిర్యాదు చేశారు.
● రణస్థలం మండలం మక్కపేట గ్రామ బౌండరీలో తన పేరున ఉన్న 2.45 ఎకరాల భూమిని తన కుమార్తె హరిలక్ష్మి, అల్లుడు మక్క అప్పలసూరి దొంగతనంగా రాయించేసుకున్నారని విజయనగరం జిల్లా, మండలం బుచ్చన్న కోనేరుగట్టు గ్రామానికి చెందిన దుంప లక్ష్మి ఫిర్యాదు చేశారు.


