శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం నశించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, జి.సింహాచలం, పి.తేజేశ్వరరావులు అన్నారు. సీఈసీ జ్ఞానేశ్కుమార్ను తొలగించాలని పోరాటం చేస్తున్న వారిపై ఢిల్లీలో పోలీస్ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆదివారం శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీని మోదీ ప్రభుత్వం పోలీస్ రాజ్యంగా మార్చేసిందన్నారు. ఇంతగా మోదీ ప్రభుత్వం భయపడుతుందంటే ఓట్ల అక్రమాలు జరిగాయని స్పష్టమవుతుందన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులకు ఓటు హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ అమ్మన్నాయుడు, కార్మిక, ప్రజా సంఘాలు నాయకులు కొత్తకోట అప్పారావు, గోవర్ధన్రావు ఎం.ఆదినారాయణమూర్తి, ఖగేష్, డి.చందు, పి.దివ్య, బి.వందన, అల్లు సోమశేఖర్, గణేష్ కిరణ్ జ్యోతిశ్వరరావు బి.సింహాచలం, ఎల్.రామప్పడు, సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


