జి.సిగడాం: మైనింగ్ పేరుతో పచ్చని పంట భూముల్లో సర్వేలు చేస్తున్నారని, ఊరిని నాశనం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని పున్నాం గ్రామ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పున్నాంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజల భూముల్లో భారీ యంత్రాల ద్వారా 500 నుంచి 800 లోతు తవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ మైనింగ్ కంపెనీ పెడితే పర్యావరణానికి దెబ్బ తగులుతుందని, పేదల భూములు వేదాంత కంపెనీకి అప్పగిస్తే విధ్వంసం జరుగుతుందని అంటున్నారు. గ్రామంలో ఉన్న వారంతా ఎకరా, రెండు ఎకరాలు సాగు చేస్తున్న సన్న కారు రైతులేనని, వారికి చెప్పకుండా సర్వే చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణం ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని వారం రోజుల నుంచి నాయకులు, అధికారుల చుట్టూ ఊరి వారు తిరుగుతూనే ఉన్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూమిని ప్రభుత్వం, ఉన్నతాధికారులు కలిపి మైనింగ్ కంపెనీకి ఇవ్వడం సబబు కాదంటున్నారు. గ్రామ సమీపంలో 152 ఎకరాల భూమిలో మైనింగ్ ఉందని, రైతుల అనుమతి లేకుండా నేరుగా వేదాంత కంపెనీ సిబ్బంది వచ్చి సర్వే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రశాంతంగా ఉన్న మా ఊరిని సర్వశానం చేయడానికి అధికారులు, నాయకులు కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూములు కాపాడుకుంటాం.
– కోట్లు భువనేశ్వరి,
పున్నాం, జి.సిగడాం మండలం
మా తాతలు ఇచ్చింది ఎకరా, రెండు ఎకరాలు భూమి మాత్రమే. మీరు లక్షలు పెట్టి కట్టుకున్న బంగ్లాలు ఇమ్మంటే ఇస్తారా..? మరి మా భూములు ఎందుకు ఇవ్వాలి.
– కూనిబిల్లి ఉత్తర, పున్నాం, గ్రామం
మా తాతలు ఇచ్చిన భూములపైకి ఎవరు వస్తారో చూస్తాం. ప్రాణాలకు తెగించి మా ఊరిని కాపాడుకుంటాం. – సాయి, పున్నాం
పున్నాం గ్రామంలో వేదాంత కంపెనీ ద్వారా మైనింగ్ పనుల కోసం చర్యలు తీసుకున్నారు. ఈ పనులను నిలుపుదల చేయకపోతే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం. రైతుల ఆమోదం లేకుండా భూములను తీసుకుని ఈ ప్రాంతాల్లో పర్యావరణానికి ఆటంకం కలిగించాలని చూస్తున్నారు.
– గొర్లె కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే


