సంగ్రామ భేరి | - | Sakshi
Sakshi News home page

సంగ్రామ భేరి

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

910 పంచాయతీల్లో..

అరసవల్లి: స్థానిక సంగ్రామానికి రంగం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పెంపు ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ను డిస్మిస్‌ చేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ‘సుప్రీం’ నిర్ణయం చెంపపెట్టు కాగా.. తాజాగా ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ‘స్థానిక’ వేడి మొదలైంది. ఎప్పుడు నోటిఫికేషన్‌ వచ్చినా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామంటూ జిల్లాలో ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు.

ఏర్పాట్లు సిద్ధం

రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు జిల్లాలో పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలకు సంబంధించి క్షేత్ర స్థాయి సమాచారాన్ని సిద్ధం చేసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, సహాయ ఎన్నికల అధికారి హోదాలో జిల్లా పరిషత్‌ సీఈఓ ఆర్‌.వెంకట్రామన్‌, జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి బృందం ఎన్నికల ప్రక్రియకు ప్రాథమిక ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎన్నికల విధులు, పోలింగ్‌ స్టేషన్లు, ఓటర్లు జాబితా, పోలింగ్‌ స్టేషన్లకు రూట్లు, జోన్లు తదితర అంశాలతో సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదితో గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల కాలపరిమితి పూర్తికాగా, గత నెల 23తో మండల పరిషత్‌లు, 24తో జిల్లా పరిషత్‌ పాలకవర్గాలకు కూడా కాలపరిమితి ముగిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానిక పరిపాలన వ్యవస్థ అంతా ప్రస్తుతానికి ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతోంది. దీంతో స్థానిక ఎన్నికల సన్నద్ధ చర్యలకు పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు.

రెండున్నరేళ్ల పాలన అనంతరం కూటమిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘స్థానిక’ ఎన్నికల్లో ఈ ప్రభావం అధికంగా కనిపించే అవకాశాలున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ముందుగా గ్రామాల్లో పంచాయతీల ఎన్నికలకు తర్వాత మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలను నిర్వహించాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీల్లో ముఖ్యంగా రాజకీయ పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలైనప్పటికీ కూటమికి కచ్చితంగా ఛీత్కారమే ఎదురవుతుందనే అనుమానాలు అధికార పార్టీ కార్యకర్తల్లోనే వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికార పక్ష నేతలు గ్రామ స్థాయి స్థానిక ఎన్నికలపై గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. జనసేన పార్టీ ఈ సారి ‘స్థానిక’ ఎన్నికల్లో అత్యధిక చోట్ల పోటీ అవకాశాలపై గంపెడాశలు పెట్టుకుంది. అయితే అసెంబ్లీలో మీకు సహకరించాం.. ఇప్పుడు స్థానికంలో మాకు సహకరించాలన్న సూత్రంపైనే జనసేన ముందుకు సాగుతున్నారు. దీంతో కూటమిలో లుకలుకలకు స్థానిక ఎన్నికలు ఓ వేదిక కానున్నాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎక్కడా ఏకగ్రీవం కాకూడదని, కచ్చితంగా పోటీ చేయాలని పిలుపునివ్వడంతో పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం రెట్టింపైంది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 38 మండలాల్లో పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాలను పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్‌లో, రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లా పరిషత్‌లో కలిపేశారు. దీంతో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 30 మండలాల్లోనే ‘స్థానిక’ ఎన్నికలను రెండు మూడు విడతల్లో పోలింగ్‌ జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించనుంది. ఈ మేరకు 30 మండలాల్లో మొత్తం 910 గ్రామ పంచాయతీలు, 8638 వార్డు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలో మొత్తం గ్రామీణ ఓటర్లు 16,20,967 మంది ఉండగా ఎన్నికల ప్రక్రియకు కోసం మొత్తం 8764 పంచాయతీ పోలింగ్‌ స్టేషన్లు సిద్ధం చేశారు. ఇక ‘పరిషత్‌’ల విషయానికొస్తే జిల్లాలో మొత్తం 30 మండలాల్లో 30 జెడ్పీటీసీలు, 542 ఎంపీటీసీల స్థానా లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలో 2004 పోలింగ్‌ స్టేషన్లు, 3134 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశారు.

బీసీ రిజర్వేషన్ల కేసును ‘సుప్రీం’ డిస్మిస్‌ చేయడంతో వేగంగా మారుతున్న సమీకరణాలు

నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా సిద్ధమంటున్న అధికారులు

ముందుగా పంచాయతీలకు.. ఆ తర్వాతే మండలాలకు ఎన్నికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement