శ్రీకాకుళం అర్బన్: దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రత్యే క సర్వీసులు నడపనుంది. సాధారణ చార్జీలతో ఈ బస్సులు నడవనున్నాయి. శ్రీకాకుళం–1, శ్రీకాకు ళం–2, టెక్కలి, పలాస తదితర నాలుగు డిపోల నుంచి 224 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈనెల 9వ తేదీ నుంచి అక్టోబరు 19వ తేదీ వరకూ ఈ సర్వీసులు నడపనున్నారు. దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేక బస్సుల పూర్తి వివరాలను ఆన్లైన్లో పెట్టారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి దూరప్రాంతమైన హైదరాబాద్కు 2 బస్సులు, విజయవాడకు 34 బస్సులు, విశాఖపట్టణానికి 120 బస్సులు నడపనున్నారు. ఎప్పటిలాగే టెక్కలి నుంచి రాజమండ్రికి 5బస్సులు, కాకినాడ నుంచి పాతపట్నంకు 2 బస్సు లు, టెక్కలి నుంచి అమలాపురానికి 3 బస్సులు నడుస్తున్నాయి.
అలాగే శ్రీకాకుళం నుంచి విశాఖపట్టణంకు 25 ఆల్ట్రాడీలక్స్, 11 అల్ట్రా పల్లెవెలుగులు, 8 పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి విశాఖపట్టణంకు ప్రతి 5 నిమిషాలకు ఒక నాన్స్టాప్ బస్సు అందుబాటులో ఉండగా ప్రత్యేక బస్సులతో కలిపి ప్రతి 2 నిమిషాలకు ఒక నాన్స్టాప్ బస్సు నడవనున్నాయి.
10 శాతం రాయితీ
ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఎప్పటిలాగే బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ముందస్తుగా రాను, పోను టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే ప్రయాణ చార్జీలో 10 శాతం రాయితీ ఇస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో కూడా ప్రయాణించే ప్రయాణికులు రాను, పోను టికెట్కు 10 శాతం రాయితీ ఇస్తున్నారు.


