శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్థాయి అథ్లె టిక్స్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా అండర్–14, అండర్–16 వయో విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా ఈ పోటీలను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 400 మందికిపైగా బాలబాలికలు హాజరయ్యారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ పోరులో పలు వురు అథ్లెటిక్స్ క్రీడాకారులు సత్తాచాటారు. విజేతలకు అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, రాష్ట్ర సలహాదారు నౌపడ విజయ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి విజేతలకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అంతకుముందు ఈ అథ్లెటిక్స్ పోటీలను ఒలింపిక్ సంఘ జిల్లా ముఖ్య సలహాదారు పి.సుందరరావు మాస్టారుతో కలిసి అథ్లెటిక్స్ సంఘ ముఖ్య ప్రతినిధులు ప్రారంభించారు. ఇక్కడ విజేతలుగా నిలిచి, మెరుగైన ట్రాక్రికార్డులు కలిగిన అథ్లెట్స్ను జాతీయ, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు పంపించనున్నట్టు కొన్న మధుసూదనరావు తెలిపారు.


